Skip to main content
Janasena chief Pawan Kalyan makes interesting comments on Amravati, the State capital of Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణం అమరావతిలోనే జరగాలని సూచించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూ పోతే మన ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరించారు. కొందరు వ్యక్తులకు అధికారం ఇచ్చాక వారు తీసుకున్న నిర్ణయాలకు మనం బందీలం అంటూ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం రాజధానిని అమరావతిలో నిర్మించాలని నిర్ణయించుకుంది. అందుకు అసెంబ్లీలో బిల్లుసైతం పాస్ చేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసింది మంచో చెడో దానికి అంతా కట్టుబడి ఉండాల్సిందేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అమరావతి రాజధాని రైతులతో ప్రత్యేకంగా భేటీ అయిన పవన్ కళ్యాణ్ రాజధాని రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏడాదికి మూడు పంటలు పండే భూములను రైతులు రాజధానికి ఇచ్చి ఎంతో త్యాగం చేశారని కొనియాడారు. రైతుల త్యాగాలను వృథాగా పోనియ్యమని మీ పోరాటాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. రైతులకు నేటికి కౌలు చెల్లించకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులు విన్న పవన్ కళ్యాణ్ చలించిపోయారు.
Comments